Yogi Adityanath: ల్యాండ్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపండి.. అధికారులకు యోగి ఆదేశం..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలతో ఇట్టే కలిసిపోతారు. తాజాగా మంగళవారం తన గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో జనతా దర్శన్ కార్యక్రమంలో ప్రజల సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూమాఫియాకు తగిన గుణపాఠం చెప్పాలని పోలీసులకు సూచించారు. గోరఖ్‌నాథ్ టెంపుల్ కాంప్లెక్స్‌లోని మహంత్ దిగ్విజయ్‌నాథ్ స్మృతి ఆడిటోరియం వెలుపల యోగి ఆదిత్యనాథ్ ప్రజలతో మాట్లాడారు.

2.ల్యాండ్‌మాఫియా

ల్యాండ్‌మాఫియా ఎవరి భూమిని ఆక్రమించకుండా చూడాలని, న్యాయపరమైన మార్గాల ద్వారా వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పరిపాలన, పోలీసు అధికారులను ఆదేశించారు. అధికారులు ఏ స్థాయిలో నిర్లక్ష్యం వహించరాదని, భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులపై త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల దరఖాస్తు లేఖలను కూడా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు అందజేశారు. జనతా దర్శన్ కార్యక్రమంలో ఆయన దాదాపు 500 మందిని కలిశారు.

3.కౌన్సెలింగ్ 

"దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీ సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని" అని ప్రజలకు యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. పరస్పర భూవివాదం విషయంలో ముందుగా బాధిత వర్గాల మధ్య కౌన్సెలింగ్ నిర్వహించి ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కంగారుపడవద్దు.. కఠిన చర్యలు తీసుకుంటామని ఫిర్యాదులతో వచ్చిన వారితో చెప్పారు.

4. ఆర్థిక సహాయం

ఇతర జిల్లాలకు సంబంధించిన ఫిర్యాదులను ఆయా జిల్లాల సంబంధిత అధికారులకు పంపాలని కోరారు. రెవెన్యూకు సంబంధించిన ఫిర్యాదులపై తహసీల్‌లలో భూముల కొలతలు, రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట పోలీసు బలగాలను కూడా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. తీవ్రమైన వ్యాధుల చికిత్స కోసం ఆర్థిక సహాయం కోరుతూ వచ్చిన వారికి యోగి ఆదిత్యనాథ్ పూర్తి సహాయాన్ని అందించారు. చికిత్సకు అయ్యే ఖర్చు అంచనా ప్రక్రియను ప్రాధాన్యతా ప్రాతిపదికన పూర్తి చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు.


కామెంట్‌లు